ప్రైవేట్ ఆసుపత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ శుక్రవారం జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడిలో సిఎం కేసీఆర్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. 

ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, "ఏపీ, తమిళనాడు రాష్ట్రాలలో కరోనా, బ్లాక్ ఫంగస్‌ వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు ఉచితంగా చికిత్స అందిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది?హైకోర్టు ఎన్నిసార్లు ఎన్ని మొట్టికాయలు వేస్తున్న కరోనా పరీక్షల సంఖ్య పెంచడం లేదు. కరోనా కేసుల సంఖ్య తక్కువ చేసి చూపించడం ద్వారా ప్రభుత్వం కరోనాను సమర్ధంగా ఎదుర్కొంటోందని ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని అందరికీ తెలుసు. ఆయుష్మాన్ భారత్‌ మొదట ఎందుకూ పనికిరాదన్న సిఎం కేసీఆర్‌ మళ్ళీ దానిని రాష్ట్రంలో ఎందుకు అమలుచేయిస్తున్నారు?కరోనాతో చనిపోయినవారి పిల్లలు ఎంతో మంది అనాధలుగా మారుతున్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలి," అని అన్నారు. 

దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ, "ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా చికిత్స పేరుతో రోగుల కుటుంబ సభ్యులను నిలువునా దోచుకొంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆసుపత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటే, టిఆర్ఎస్‌ సర్కార్ వాటితో కుమ్మక్కు అయ్యింది. కరోనా సోకిన తమ భర్త, తల్లితండ్రులు, పిల్లలను కాపాడుకోవడానికి  ప్రజలు తమ కష్టార్జితాన్ని అంతా ఊడ్చిపెట్టి ఆసుపత్రుల చేతిలో పోస్తున్నారు. కానీ అవీ ఏమాత్రం సరిపోకపోవడంతో ఆడవాళ్ళు తమ మెళ్ళోని పుస్తేలు, వారి ఇళ్ళు, స్థలాలు, పొలాలు తాకట్టు పెట్టి తెచ్చి ఆసుపత్రులకు చెల్లిస్తున్నారు. అయినా ప్రాణాలు దక్కడం లేదు. ఇవన్నీ సిఎం కేసీఆర్‌ కంటికి కనబడటం లేదా? ప్రజల కంటే ప్రైవేట్ ఆసుపత్రుల ప్రయోజనాలే ముఖ్యమైపోయాయా?" అంటూ తీవ్రంగా విమర్శించారు.