
కరోనా కట్టడికి రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పటికీ చాలామంది ఏదో సాకుతో వాహనాలు వేసుకొని రోడ్లపై తిరుగుతూనే ఉన్నారు. అందుకు వారు చెపుతున్న రకరకాల కారణాలు పోలీసులను సైతం తికమక పడేలా చేస్తున్నాయి. దాంతో పోలీసులు వారిని రోడ్లపై తిరగవద్దంటూ సున్నితంగా హెచ్చరించి పంపించేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో రోడ్లపై తిరుగుతున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో జనాలు రెచ్చిపోతున్నారు. లాక్‌డౌన్ సమయంలో కూడా రోడ్లనీ వాహనాలతో నిండిపోతున్నాయి. దీంతో పోలీసులు లాక్‌డౌన్ అమలుచేసే బదులు ట్రాఫిక్‌ను నియంత్రించవలసి వస్తోంది.
ఈ సమస్యను గుర్తించిన డిజిపి మహేందర్ రెడ్డి నేటి నుండి ఉదయం 10 గంటల తరువాత రోడ్లపైకి వచ్చే వాహనాలను తాత్కాలికంగా జప్తు చేసి సంబందిత పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని ఆదేశించారు. ఉదయం 6 నుంచి 10 గంటలలోగా నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చే ప్రజలు మార్కెట్లలో గుంపులు గుంపులుగా ఒకేచోట చేరకుండా పోలీసులు నియంత్రిస్తూ వారికి కరోనా జాగ్రత్తల గురించి చెప్పాలని ఆదేశించారు. లాక్‌డౌన్ మొదలవడానికి 15 నిమిషాల ముందే పోలీసులు, అధికారులు అందరూ రోడ్లపై ఉండి ప్రజలను వెనక్కు తిప్పి పంపాలని ఆదేశించారు. ఉదయం 10 గంటలకు లాక్‌డౌన్ మొదలవగానే అన్ని పోలీస్ గస్తీ వాహనాలు సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేయాలని డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశించారు.