
పార్లమెంట్ లేదా శాసనసభ బడ్జెట్ సమావేశాలలో రోజుల తరబడి సుదీర్ఘమైన చర్చలు, అధికార ప్రతిపక్షాల వాదోపవాదాలు…బడ్జెట్లో ప్రభుత్వం తమకేమి వరాలు, వడ్డింపులు చేస్తుందని ప్రజలు ఎదురుచూడటం...వగైరాలన్నీ సర్వసాధారణమైన విషయాలు. అయితే ఈసారి కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలలో అటువంటి హడావుడి ఏమీ లేకుండా అంతా ఒక్కరోజులోనే ముగియబోతోంది.
ఈరోజు ఉదయం 8.30 గంటలకు అమరావతిలోని ఏపీ సచివాలయంలో సిఎం జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. దానిలో రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. ఆ తరువాత ఆనవాయితీ ప్రకారం ఉదయం 11 గంటలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ రాజ్‌భవన్ నుండే వర్చువల్ విధానంలో ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. అనంతరం శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం జరుగుతుంది. మళ్ళీ ఉభయసభలు సమావేశమవగానే గవర్నర్ ప్రసంగంపై క్లుప్తంగా చర్చించి ఆమోదిస్తారు. ఆ తరువాత ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. వెంటనే దానిని ఆమోదించి శాసన మండలి ఆమోదానికి పంపిస్తారు. దానికి మండలి ఆమోదం తెలుపగానే ఉభయసభలనునిరవధికంగా వాయిదావేస్తారు. కరోనా మహమ్మారి పుణ్యమాని ఒక్కరోజులోనే బడ్జెట్ ప్రక్రియ అంతా ముగియనుంది. ఈ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడంతో, సమావేశాలు ఏకపక్షంగా సజావుగా సాగిపోనున్నాయి.