ఆసుపత్రుల అడ్మిషన్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి

ఇరుగుపొరుగు రాష్ట్రాలలో కరోనా కేసులు పెరిగిపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు నిండిపోతుండటంతో, ఆ రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల నుంచి ప్రతీరోజు డజన్ల కొద్దీ కరోనా రోగులు హైదరాబాద్‌ హైదరాబాద్‌ వస్తున్నారు. అయితే వారికి హైదరాబాద్‌లోని ఏదైనా ఆసుపత్రులలో అడ్మిషన్ ఉన్నట్లు దృవీకరణ పత్రాలు ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇరుగుపొరుగు రాష్ట్రాలకు తెలియజేసింది. 

కరోనా చికిత్సకు ముందుగా ఆసుపత్రులలో అడ్మిషన్ తీసుకోకుండా అంబులెన్సులలో హైదరాబాద్‌ వస్తున్నవారు, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుండటం వలన వారి ద్వారా నగరంలో కొత్త రకం కరోనా స్ట్రెయిన్స్ వ్యాపించే ప్రమాదం ఉందని, రోగులు విలువైన సమయాన్ని కోల్పోతున్నారని కనుక ముందుగా ఆసుపత్రులలో బెడ్లు రిజర్వ్ చేసుకొని నిర్ధారించుకొన్న తరువాతే హైదరాబాద్‌ రావాలని తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ ఇరుగుపొరుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు వ్రాశారు. 

అంబులెన్సులలో హైదరాబాద్‌కు వచ్చే రోగులు, వారి సహాయకులు, ఆసుపత్రి పేరు, బెడ్ రిజర్వేషన్ వివరాలను ఆయా రాష్ట్రాలు ముందుగా తెలంగాణ కంట్రోల్ రూమ్‌కు పంపించినట్లయితే వాటిని పరిశీలించి నిర్ధారించుకొన్న తరువాత రోగులను అనుమతిస్తామని లేఖలో తెలియజేశారు. ఒకవేళ నేరుగా రాష్ట్ర సరిహద్దులకు వచ్చే రోగులు ఈ వివరాలన్నిటినీ పోలీస్ అధికారులకు అందజేసినా వారు సంబందిత ఆసుపత్రులతో మాట్లాడి నిర్దారించుకొని అనుమతిస్తున్నారు. 

ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా చికిత్స కోసం వచ్చే రోగులను అడ్డుకోవద్దని హైకోర్టు హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.