ఇటీవల జరిగిన కేరళ శాసనసభ ఎన్నికలలో ఎల్డీఫ్ కూటమి ఘన విజయం సాధించడంతో, పినరయి విజయన్ మళ్ళీ మరోసారి కేరళ ముఖ్యమంత్రి కానున్నారు. ఈనెల 20వ తేదీన ఆయన కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన ఈనెల 15న ప్రమాణస్వీకారం చేస్తారని ఎల్డీఫ్ నేతలు చెప్పారు. కానీ ఎందుకో 20వ తేదీకి వాయిదా పడింది. ఆయనతో కలిపి మొత్తం 21 మందిని మంత్రివర్గంలోకి తీసుకొనున్నట్లు సమాచారం.
కేరళ శాసనసభలో మొత్తం 140 సీట్లలో వామపక్ష కూటమి (ఎల్డీఫ్)కి 97 సీట్లు, కాంగ్రెస్ కూటమి(యూడీఎఫ్)కి 47 సీట్లు వచ్చాయి. కేరళలో ప్రతీ 5 ఏళ్ళకోసారి ఈ రెండు కూటముల మద్యే అధికార మార్పిడి జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం మళ్ళీ అధికార ఎల్డీఫ్ కూటమికే కేరళ ప్రజలు పట్టంగట్టారు.
ఈ ఎన్నికలలో బిజెపికి తీవ్ర నిరాశ మిగిలింది. అధికారంలోకి రాలేకపోయినా కనీసం గౌరవప్రదమైన సీట్లు గెలుచుకొని కేరళలో అడుగుపెట్టాలని తహతహలాడిన బిజెపి, మెట్రో మ్యాన్ శ్రీధరన్‌ను పార్టీలోకి ఆహ్వానించి ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ ఆయనతో సహా పార్టీ అభ్యర్ధులలో ఏ ఒక్కరూ గెలవలేకపోయారు.