తెలంగాణ రాష్ట్రంలో బుదవారం నుంచి పది రోజులపాటు లాక్డౌన్ విధించబడుతుంది. ఈరోజు ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై లోతుగా చర్చించిన తరువాత 10 రోజులు లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకొనేందుకు ప్రతీరోజు ఉదయం 6 నుండి 10 గంటల వరకు అనుమతిస్తారు. ఆ తరువాత మళ్ళీ మర్నాడు ఉదయం 6 గంటల వరకు సంపూర్ణ లాక్డౌన్ అమలుచేస్తారు. మందులు దుకాణాలు, దవాఖానాలు, పెట్రోల్ బంకులు తదితర అత్యవసర సేవలకు లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు.
అయితే కరోనా టీకాలువేసే ప్రక్రియ కొనసాగుతున్నందున టీకాలు వేసుకొనేవారిని లాక్డౌన్ సమయంలో బయటకు అనుమతిస్తారా లేక ఉదయం 6 నుండి 10 గంటలలోపే టీకాల కార్యక్రమం కూడా ముగిస్తారా? అనేది ఇంకా తెలియవలసి ఉంది.
ఆకస్మిక లాక్డౌన్పై హైకోర్టు ఆగ్రహం
ఈరోజు ఉదయం కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన హైకోర్టు లాక్డౌన్ విధింపుపై ప్రభుత్వ వివరణ కోరింది. మధ్యాహ్నం 2.30 తరువాత మళ్ళీ ఆ కేసుపై విచారణ చేపట్టినప్పుడు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టుకు ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేశారు. రేపటి నుంచి పది రోజులపాటు రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. దీనిపై హైకోర్టు మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు ఉదయం వరకు లాక్డౌన్ ఆలోచన కూడా చేయని ప్రభుత్వం వారాంతపు లాక్డౌన్ గురించి ఆలోచించమని మేము చెపితే హటాత్తుగా పది రోజులు లాక్డౌన్ విధించడం ఏమిటని మండిపడింది. ఇప్పటికిప్పుడు లాక్డౌన్ ప్రకటిస్తే సొంతూర్లకు వెళ్లవలసినవారు ఏవిదంగా వెళతారని ప్రశ్నించింది. అలాగే లాక్డౌన్ సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏవిదంగా కొనసాగిస్తారని ప్రశ్నించింది. రెండో డోస్ వాక్సిన్ వేసుకొనేవారిని లాక్డౌన్ సమయంలో టీకా కేంద్రాలకు వెళ్ళేందుకు అనుమతించాలని ఆదేశించింది. అలాగే ఏపీ నుంచి కరోనారోగులను తీసుకువస్తున్న అంబులెన్సులను అడ్డుకోరాదని పోలీసులను హెచ్చరించింది.