తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు

కరోనా కట్టడిపై నేడు మళ్ళీ విచారణ చేపట్టిన హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వానికి మళ్ళీ మొట్టికాయలు వేసింది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకొంటున్న అరకొర చర్యల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే లాక్‌డౌన్‌ విధించడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని అడ్వకేట్ జనరల్ ప్రసాద్‌ను హైకోర్టు నిలదీసింది. కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు మతపరమైన సమావేశాలు, ప్రార్ధనలకు అనుమతిలేదని చెపుతూనే పాతబస్తీలో చూసిచూడనట్లు ఎందుకు ఊరుకొంటోందని ప్రశ్నించింది.

కరోనా ఆంక్షలు ఖచ్చితం అమలుచేయాలని, కరోనా పరీక్షలు మరింత పెంచాలని పదేపదే చెపుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని కోర్టు ధిక్కారంగా భావించి సంబందిత అధికారులందరికీ నోటీసులు జారీ చేయవలసి వస్తుందని హెచ్చరించింది. కనీసం రాత్రిపూట కర్ఫ్యూను కూడా సరిగ్గా అమలుచేయలేకపోతోందని హైకోర్టు ఆక్షేపించింది.

ఏపీ నుంచి కరోనా రోగులను హైదరాబాద్‌ ఆసుపత్రులకు తీసుకువస్తున్న అంబులెన్సులని సరిహద్దుల వద్ద పోలీసులు ఎందుకు అడ్డుకొంటున్నారని...అలా అడ్డుకోవాలని ఎవరు ఆదేశించారని హైకోర్టు ప్రశ్నించింది. ఈరోజు జరిగిన విచారణకు హైదరాబాద్‌, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్లు, జీహెచ్‌ఎంసీ కమీషనర్ హాజరయ్యారు.

ఈరోజు మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశంలో వీటన్నిటిపై చర్చించి నిర్ణయాలు తీసుకొంటారు కనుక వీటన్నిటిపై హైకోర్టుకు వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ కోరగా, ఈ కేసు విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.