
మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలపై ప్రభుత్వం హడావుడిగా విచారణ జరిపిస్తుండటంపై హైకోర్టు ఆక్షేపించింది. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం పరిధిలోని దేవరయాంజల్ భూములలో ఈటల రాజేందర్ అక్రమంగా గోదాములు నిర్మించినట్లు గుర్తిచిన రాష్ట్ర ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులతో ఓ విచారణ కలిటీ వేసింది. దీనికోసం ప్రభుత్వం ఈనెల 3వ తేదీన జీఓను (నెంబర్: 1014) కూడా జారీ చేసింది. దీనిపై అభ్యంతరాలు తెలుపుతూ దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరిపిన హైకోర్టు, ఈ సందర్భంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ పక్క రాష్ట్ర ప్రజలు కరోనాతో అల్లాడిపోతుంటే ప్రభుత్వం దృష్టి భూవిచారణపై ఉందని ఆక్షేపించింది. ప్రభుత్వం హడావుడిగా నలుగురు ఐఏఎస్ అధికారులతో విచారణ కలిటీ వేయవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. పేపర్లలో వచ్చిన వార్తలు పట్టుకొని ప్రభుత్వం జీవో జారీ చేయడం ఏమిటని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఈ ఒక్క ఆలయభూములే కబ్జాకు గురయ్యాయా?మిగిలినవన్నీ భద్రంగానే ఉన్నాయా?” అని ప్రశ్నించింది.
ప్రభుత్వం జారీ చేసిన జీవో, విచారణ కమిటీలపై ఏజీ ప్రసాద్ ఇచ్చిన వివరణలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏది ఏమైనప్పటికీ, ముందుగా సంబందిత వ్యక్తులకు చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసి వారి వివరణ తీసుకోవాలని ఏజీని ఆదేశించింది.