గత వారం పది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రామగుండం తరలించినట్లు తెలుస్తోంది. హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి దంపతుల హత్య కేసులో పుట్ట మధు ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న కుంట శ్రీనివాస్ హంతకులుగా అనుమానింపబడుతున్నవారితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు పుట్ట మధు పేరును పలుమార్లు ప్రస్తావించడమే అందుకు కారణం. అయితే ఆ హత్య కేసుతో తనకు ఎటువంటి సంబందమూ లేదని పుట్ట మధు చెప్పారు. కానీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళేవరకు కూడా పోలీసులు ఆయన జోలికి వెళ్ళలేదు. ఈటల రాజేందర్ భూకబ్జాల వ్యవహారం బయటపడినప్పటి నుంచే పుట్టా మధు కనిపించకుండాపోవడంతో రామగుండం పోలీసులు ఆయన కోసం గాలింపు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ కేసులో ఆయన మేనల్లుడు బిట్టు శీనును పోలీసులు అరెస్ట్ చేశారు.