రోడ్డు పక్కన వాక్సిన్ ట్రక్...డ్రైవర్, క్లీనర్ మిస్సింగ్

ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాలలో వ్యాక్సిన్‌ కొరత నెలకొని ఉండటంతో తరచూ టీకాలు వేసే ప్రక్రియను నిలిపివేయవలసి వస్తోంది. ఇటువంటి సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నర్సింగాపూర్ కరేలీ అనే ప్రాంతంలో బస్టాండ్ సమీపంలో ఓ ట్రక్ చాలా సేపుగా నిలిచి ఉంది. దాని డ్రైవర్, క్లీనర్ ఎంతసేపటికీ రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు డ్రైవర్, క్లీనర్ ఎంత వెతికినా కనబడలేదు. దాంతో వారు ట్రక్ తాళం పగులగొట్టి చూడగా లోపల సుమారు రూ. 8 కోట్లు విలువగల 2.40 లక్షల డోసుల కోవాక్సిన్ టీకాలున్నాయి. అదృష్టవశాత్తు టీకాలున్న కంటెయినర్‌లో ఏసీ పనిచేస్తుండటంతో వాక్సిన్లు పాడవలేదు.

తరువాత పోలీసులు డ్రైవర్ నెంబర్ కనుగొని దాని ఆధారంతో గాలించగా హైవేకు సమీపంలో ఆ మొబైల్ ఫోన్‌ తుప్పల్లో పడి ఉన్నట్లు కనుగొన్నారు. కానీ డ్రైవర్, క్లీనర్ మాత్రం ఎక్కడున్నారో... వారు అంతవిలువైన వాక్సిన్లున్న ట్రక్కును వదిలేసి ఎందుకు.. ఎక్కడికి వెళ్లిపోయారో తెలియలేదు. పోలీసులు వెంటనే భారత్‌ బయోటెక్ కంపెనీకి ఫోన్‌ చేసి ఈ విషయం తెలియజేసి డ్రైవర్, క్లీనర్ కోసం గాలింపు మొదలు పెట్టారు. ప్రస్తుతం వాక్సిన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది కనుక ఎవరైనా వారిని బెదిరించారా? ఎవరైనా వారిని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారా? అయితే వాక్సిన్లను తీసుకువెళుతున్న ట్రక్కును ఎందుకు తీసుకువెళ్లలేదు?అనే కోణంలో మధ్యప్రదేశ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.