భూకబ్జా ఆరోపణలపై మంత్రి ఈటల ఏమన్నారంటే...

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌...అనుచరులు కలిసి తమ అసైన్డ్ భూములను కబ్జా చేశారంటూ మెదక్ జిల్లాలోని కొందరు రైతులు ఫిర్యాదు చేయడం, సిఎం కేసీఆర్‌ వెంటనే విచారణకు ఆదేశించడంపై ఆయన వెంటనే స్పందించారు. 

హైదరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ, “రాజకీయంగా నన్ను దెబ్బ తీసేందుకే కొందరు ఓ పధకం ప్రకారం నాపై ఈ బురద జల్లి కుట్రలకు పాల్పడుతున్నారు. అయితే నేనేనాడు ఎవరి దగ్గరా పైసా తీసుకోలేదు... ఎవరి భూములు గుంజుకోలేదు. ఈ వ్యవహారం ఎవరితోనైనా...ఎన్ని విచారణాలైన జరుపుకోవచ్చు. కానీ సిఎం కేసీఆర్‌ ముందుగా నాతో నేరుగా మాట్లాడి నిజానిజాలు తెలుసుకోకుండా విచారణకు ఆదేశించడం సరికాదు. ఒకవేళ నేను భూకబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తాను. నాకు నా ఆత్మగౌరవం, నా కుటుంబ పేరు ప్రతిష్టల కంటే పదవులు, అధికారం ముఖ్యం కాదు. నేను పదవులు, డబ్బు, ఆస్తుల కోసం ఆరాటే పడేవాడిని కానని అందరికీ తెలుసు. నాగురించి పార్టీలో అందరికీ తెలుసు. అలాగే అందరి చరిత్రలు నాక్కూడా బాగా తెలుసు. 

నేను అచ్చంపేట, హకీంపేటలో పౌల్ట్రీ ఫారంలు ఏర్పాటు చేయాలనుకొన్నాను. వాటి కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థను సంప్రదిస్తే వారు రైతులు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవచ్చునని చెప్పారు. అప్పుడే మేము రైతులను సంప్రదించగా వారు ఆ పనికిరాని భూములను తమ అవసరాల కోసం నాకు అమ్మేందుకు అంగీకరించారు. వారికి ఒక్కొక్కరికీ ఎకరాకు రూ.6 లక్షలు చొప్పున డబ్బు చెల్లించి మొత్తం 40 ఎకరాల భూములు తీసుకొన్నాను. రైతులకు డబ్బు చెల్లించిన తరువాత ఆ భూములకు సంబందించిన పత్రాలు తీసుకొన్న మాట వాస్తవం. ఈ విషయాలన్నీ సిఎం కేసీఆర్‌కు , సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావుకు, ప్రభుత్వంలో చాలామందికి కూడా తెలుసు. అయినా నాపై విచారణకు ఆదేశించారు. 

నావంటి నిజాయితీపరుడిపై బురద జల్లి రాజకీయంగా నన్ను దెబ్బ తీయాలని చూస్తున్నదెవరో నాకు తెలుసు. పార్టీలో స్కూటర్‌పై తిరిగే ఓ వ్యక్తి ఇప్పుడు వందల కోట్లు ఎలా సంపాదించుకొన్నాడు? అలాగే పరిశ్రమలు, ఫార్మా సిటీ పేరుతో భూములు కబ్జాలు చేసిందెవరో అందరికీ తెలుసు. వారిపై సిఎం కేసీఆర్‌ విచారణ జరిపించగలరా?” అని మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రశ్నించారు.  

“మా కుటుంబం 1986 నుంచి ఈ పౌల్ట్రీ ఫారం వ్యాపారంలో ఉంది. 1992లోనే వరంగల్‌లో 50 పౌల్ట్రీ ఫారంలు ఏర్పాటు చేశాము. సుమారు 16 ఏళ్ళ క్రితమే మాకు 124 ఎకరాల భూములున్నాయి. మేము న్యాయంగా పౌల్ట్రీ వ్యాపారాలు చేసుకొంటూ సంపాదించుకొన్నామే తప్ప ఏనాడూ అక్రమంగా ఆస్తులు కూడబెట్టాలనుకోలేదు. ఎందుకూ పనికిరాని ఆ  భూములను కొనుగోలు చేసి అక్కడ పౌల్ట్రీ ఫారంలు పెట్టాలనుకొన్నాను తప్ప మేము ఎవరి భూములు గుంజుకోలేదు. నాపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్దం. వాటిని నేను ఖండిస్తున్నాను. నాపై ఇటువంటి ఆరోపణలు రావడం చూసి నాకు భూములు అమ్మిన ఆ రైతులు కూడా బాధపడుతున్నారు. ఈ వ్యవహారంలో నేను ఏ విచారణకైనా సిద్దం. నేను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తాను,” అని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.