
దేశంలో ప్రధానంగా మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్,పంజాబ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఎక్కువగా కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మొన్న మంగళవారం నమోదైన పాజిటివ్ కేసులలో ఆ రాష్ట్రాలలోనే 73.59 శాతం నమోదయ్యాయి. ఇవి కాక దేశంలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, పుణే, థానే, నాసిక్, ఔరంగాబాద్, రాయ్పూర్, బెంగుళూరు, హైదరాబాద్, కోల్కతా, చెన్నై, త్రివేండ్రం తదితర నగరాలలో కూడా ప్రతీరోజు భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా 150 జిల్లాలలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నట్లు కేంద్రప్రభుత్వం గుర్తించింది. వాటితో సహా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రధాన నగరాలలో కరోనా గొలుసును త్రెంచి కరోనాను కట్టడి చేసేందుకు మళ్ళీ సంపూర్ణ లాక్డౌన్ విధించాలని కేంద్రప్రభుత్వం భావిస్తునట్లు తాజా సమాచారం. దీనిపై ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కేంద్రహోంమంత్రి అమిత్ షాలు వివిద శాఖల ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలలో ఇప్పటికే లాక్డౌన్ అమలులో ఉంది. మరికొన్ని రాష్ట్రాలలో పాక్షిక లాక్డౌన్ అమలుచేస్తున్నారు. కనుక కేంద్రప్రభుత్వ లాక్డౌన్ ప్రతిపాదనను ఆయా రాష్ట్రాలు వ్యతిరేకించకపోవచ్చు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సంప్రదింపులు పూర్తవగానే దేశంలో పలు ప్రాంతాలలో లాక్డౌన్ విదించే అవకాశాలున్నాయి.