
పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ అధినేత అదర్ పూనావాలకు కేంద్రప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కల్పించింది. కోవీషీల్డ్ వాక్సిన్లను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ ఆసుపత్రులకు సరఫరా చేసుకొనేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించినందున వాక్సిన్ కోసం సహజంగానే ఆయనపై ఒత్తిళ్ళు పెరిగే అవకాశం ఉంది. పైగా ఇప్పుడు 18 ఏళ్ళకు పైబడిన వారందరికీ వాక్సినేషన్‌కు అనుమతించడంతో ఒకేసారి వ్యాక్సిన్‌కు డిమాండ్ పెరిగి కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. అదీగాక రాష్ట్రాలకు ఒక్కో డోస్ రూ.300 చొప్పున, ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక్కో డోస్ రూ.600 చొప్పున ధరలు ప్రకటించడంతో వాక్సిన్లు సరఫరా, ధరల తగ్గింపు కోసం కూడా అదర్ పూనావాలపై వివిద వర్గాల నుండి ఒత్తిళ్ళు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యగా ఆయనకు వై కేటగిరీ భద్రతను కల్పిస్తున్నట్లు సమాచారం.