ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి సిబిఐ కోర్టు ఈరోజు నోటీస్ జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న ఆయన షరతులతో కూడిన బెయిలుపై జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఆయన బెయిల్‌పై నిబందనలను ఉల్లంఘిస్తున్నారని, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కనుక ఆయన బెయిల్‌పై రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సిబిఐ కోర్టులో ఓ పిటిషన్ వేశారు. దానిని విచారణకు స్వీకరించిన కోర్టు, ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఆదేశిస్తూ నేడు నోటీస్ జారీ చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది.
గత పదేళ్లుగా సిబిఐ కోర్టులో అక్రమాస్తుల కేసులను అలవోకగా నడిపిస్తున్న ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఇది చాలా చిన్న విషయమే అని చెప్పవచ్చు. ఈ కేసును చాలా సులువుగానే ఎదుర్కోగలరని చెప్పవచ్చు. అయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వ్యక్తికి సిబిఐ కోర్టు నుంచి ఇటువంటి నోటీస్ అందుకోవలసిరావడం అవమానకరమే అని చెప్పవచ్చు.