సిఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల విమర్శలు

తెలంగాణ రాజకీయాలలో హటాత్తుగా ప్రవేశించిన వైఎస్ షర్మిల తన ఉనికిని చాటుకొంటూ తెలంగాణ ప్రభుత్వం, సిఎం కేసీఆర్‌పై తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఇందిరా పార్కులో ధర్నా చేస్తే, ఆమే సూచనపై ప్రభుత్వం స్పందించకుండా, పోలీసులతో ఆమె దీక్షను భగ్నం చేయడాన్ని వైఎస్ షర్మిల తప్పు పట్టారు. లోటస్‌పాండ్‌  నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ అసలు ఎవరూ తనను ప్రశ్నించడాన్ని సహించలేని సిఎం కేసీఆర్‌ ఓ మహిళ ప్రశ్నిస్తే సహించగలరా? కరోనాతో ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం. కానీ సీతక్క ధైర్యంగా ముందుకు వచ్చి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే ఆమెకు సమాధానం చెప్పకుండా దీక్షను భగ్నం చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. మహిళ వ్యతిరేక పాలన చేస్తున్న సిఎం కేసీఆర్‌కు మహిళలు చేపట్టబోయే ఉద్యమాలతోనే బుద్ధి చెపుతారు,” అని అన్నారు.