తెలంగాణలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌: సిఎం కేసీఆర్‌

కేంద్రప్రభుత్వం అనుమతితో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా కరోనా వాక్సిన్ ధరలు ప్రకటించడంతో అన్ని రాష్ట్రాలలో కలకలం మొదలైంది. రాష్ట్రాలకు ఒక్కో వాక్సిన్ డోస్ రూ.400 చొప్పున సరఫరాచేయాలని నిర్ణయించడంతో ఆ భారం భరించలేని రాష్ట్రాలలో ఉచిత వాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్‌ వెంటనే ఖండించారు. దీనిపై సిఎం కేసీఆర్‌ కేంద్రానికి ఓ లేఖ వ్రాయబోతున్నట్లు సమాచారం. అంతకంటే ముందు ప్రజలలో నెలకొన్న అయోమయాన్ని తొలగించేందుకు ఓ నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఉచితంగానే కరోనా టీకాలు ఇవ్వాలని, ఆ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రజల ఆరోగ్యంకంటే ఏదీ ముఖ్యం కాదని అన్నారు. 

కరోనా ఆసుపత్రులలో ఐసీయులలో ఇటీవల అగ్నిప్రమాదాలు జరుగుతున్న వార్తలు వస్తుండటంతో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా అవసరమైన అగ్నిమాపక ఏర్పాట్లు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. గాంధీ ఆసుపత్రి, టిమ్స్ ఆసుపత్రి వద్ద అగ్నిమాపక యంత్రాలను సిద్దంగా ఉంచాలని ఆదేశించారు.  

కరోనా వాక్సిన్ ధరలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కేంద్రప్రభుత్వం సమాధానమిచ్చింది. దేశంలో రెండు కంపెనీల నుండి రూ.150 చొప్పున కేంద్రం కొంటున్న టీకాలన్నిటినీ రాష్ట్రాలకు ఇక ముందు కూడా యధాప్రకారం ఉచితంగా పంపిణీ చేస్తుంటుందని తెలిపింది.