సీజేఐగా జస్టిస్ ఎన్‌వి రమణ నేడు ప్రమాణస్వీకారం

సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా మన తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్‌వి రమణ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జస్టిస్ ఎన్‌వి రమణ చేత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. జస్టిస్ ఎన్‌వి రమణ ఈ పదవిలో 2022, ఆగస్ట్ 26వరకు కొనసాగుతారు. 

జస్టిస్ ఎన్‌వి రమణ ఇంతకు ముందు సమైక్య రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తిగా, ఆ తరువాత కొంతకాలం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా , తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ఫిబ్రవరి 2014లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులందరిలో జస్టిస్ ఎన్‌వి రమణ చాలా సీనియర్ కావడంతో ఈ అత్యున్నత పదవి లభించింది. 

ఇంతకాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ బాబ్డే నిన్న పదవీ విరమణ చేసారు. ఆయనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు కోర్టుహాలులో నిన్న ఘనంగా వీడ్కోలు పలికారు.