
టిడిపి సీనియర్ నేత ధూళిపాళ నరేంద్రను శుక్రవారం తెల్లవారుజామున ఏపీ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సంగం డెయిరీలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏసీబీ అధికారులు ఈరోజు తెల్లవారుజామున గుంటూరు జిల్లా, పొన్నూరు మండలంలోని చింతలపూడిలో ఆయన నివాసం నుంచి అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు. ఆయనపై సెక్షన్స్ 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్విత్ 34 కింద కేసులు నమోదు చేసి నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేశారు.
ఆయన స్థానికంగా, రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా సుమారు 100 మంది పోలీసులు, పోలీస్ అధికారులను వెంటబెట్టుకొని ఏసీబీ అధికారులు రావడంతో ధూళిపాళ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ధూళిపాళ అరెస్ట్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పొన్నూరులో భారీగా పోలీసులను మోహరించారు.
ధూళిపాళ నరేంద్ర అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపేనని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అరెస్టులు, బెదిరింపులకు భయపడి వెనక్కు తగ్గేది లేదని టిడిపి సీనియర్ నేత నారా లోకేశ్ అన్నారు. జగన్ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుంటుందని అన్నారు.