ఈ నెల 30వ తేదీన వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లకు, మరో ఐదు పురపాలక సంఘాలకు జరుగవలసిన ఎన్నికలు యధాతధంగా జరుపుతామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కరోనా నేపధ్యంలో ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీతో సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. కానీ ఈ దశలో ఎన్నికల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది.
సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్, ఇంకా పలువురు అధికారులు, నేతలు కరోనా బారిన పడటంతో ఇంతకాలం ఈ ఎన్నికల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న రాజకీయ నేతలు ఇప్పుడు కాస్త భయం భయంగానే ముందుకు సాగుతున్నారు.
మాస్క్ ధరించకపోతే రూ.1,000 జరిమానా వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వమే పోలీసులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికార, ప్రతిపక్ష నేతలు పాల్గొనే ఎన్నికల ప్రచారంలో ఎవరికీ జరిమానా విధించే పరిస్థితి కనబడటం లేదు. కనుక ఈ ఎన్నికలు ముగిసేసరికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.