
తెలంగాణాలో మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు నేడే పోలింగ్ జరుగనుంది. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు, కార్యాలయాలకు ప్రభుత్వం నేడు శలవు ప్రకటించింది. ఈరోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కరోనా రోగులకు ఓట్లు వేసే అవకాశం కల్పిస్తారు. ఈ ఉపఎన్నిక ఈవీఎంల ద్వారా జరుగబోతున్నాయి.
ఈ ఒక్క స్థానానికి మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులతో కలిపి మొత్తం 41 మంది పోటీ పడుతున్నారు. సాగర్ నియోజకవర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 1,09,228, మహిళలు 1,171,072 మంది ఉన్నారు. వీరికోసం మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పోలింగ్ సజావుగా జరిగేందుకు 3,000 మంది పోలీసులను, మూడు కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లు డిఐజీ రంగనాథ్ చెప్పారు.
కరోనా నేపధ్యంలో పోలింగ్ కేంద్రాలలోపలా, బయటా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.