మాజీమంత్రి అజ్మీరా చందూలాల్‌ మృతి

మాజీమంత్రి,  టిఆర్ఎస్‌ సీనియర్‌ నేత అజ్మీరా చందూలాల్‌ (67) గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామానికి చెందిన అజ్మీరా చందులాల్ తొలుత ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఆ సమయంలోనే గిరిజనులను చైతన్యపరిచి వారి పిల్లలను చదువుకొనేలా చేశారు. గిరిజనుల అభిమానం చూరగొన్న ఆయనను టిడిపిలోకి ఆహ్వానించడంతో రాజకీయాలలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2005లో టిఆర్ఎస్‌లో చేరి తెలంగాణ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన గిరిజన సంక్షేమ, సాంస్కృతిక శాఖల మంత్రిగా పనిచేశారు. మంత్రి పదవి చేపట్టినప్పటికీ గిరిజనులతో ఆయన సంబందాలు అలాగే కొనసాగాయి. సిఎం కేసీఆర్‌ను ఒప్పించి మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటింపజేశారు.

అజ్మీరా చందూలాల్‌కు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మృతిపట్ల సిఎం కేసీఆర్‌, మంత్రులు ఈటల రాజేందర్‌, హరీష్‌రావు, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, టిఆర్ఎస్‌ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం చందూలాల్ స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.