
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సీనియర్ నేత కె.జానారెడ్డి ఇవాళ్ళ హాలియాలో ఎన్నికల ప్రచారం ముగించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించబోతోంది. ఎన్నికల ప్రచారంలో ప్రజా స్పందనను బట్టి నేను భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని గట్టి నమ్మకంతో ఉన్నాను. ఈ ఉపఎన్నికలలో అధికారపార్టీ ఆగడాలు చాలా ఎక్కువైపోయాయి. మా పార్టీ నేతలు, కార్యకర్తలు వారితో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. గతంలో ఎన్నడూ చూడనివిదంగా టిఆర్ఎస్ నీచరాజకీయాలు చేస్తోంది. ఈ నీచరాజకీయ ఒరవడిని వ్యతిరేకిస్తూ సాగర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి టిఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
హాలియా సభలో సిఎం కేసీఆర్ ప్రజలను తప్పు దోవ పట్టించేవిదంగా మాట్లాడారు. నిజానిజాలేమిటో ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ హయాంలో అసలు తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరుగలేదన్నట్లు సిఎం కేసీఆర్ మాట్లాడటం చాలా హాస్యస్పదంగా ఉంది. తన ఒక్కడివల్లే తెలంగాణ వచ్చిందన్నట్లు కేసీఆర్ గొప్పలు చెప్పుకొంటున్నారు. కానీ తెలంగాణ కోసం ఏపీలో కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టిన విషయం అందరికీ తెలుసు. కనుక ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.