నేడు అంబేడ్కర్ జయంతి...ఘనంగా నివాళులు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, వివిద ప్రజాసంఘాలు, బడుగు బలహీనవర్గాల నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ తదితరులు హైదరాబాద్‌ ట్యాంక్ బండ్‌పై గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ అతి త్వరలోనే హైదరాబాద్‌ నడిబొడ్డున దేశంలోకెల్ల అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. 

మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ, “డాక్టర్ అంబేడ్కర్ దేశంలో కులమత రహిత సమాజం కోరుకొన్నారు. ప్రజలందరూ సమానంగా స్వేచ్ఛగా జీవించాలని కోరుకొన్నారు. కానీ నేటికీ రిజర్వేషన్ల కోసం పోరాడవలసివస్తోంది.  పాలకులు ఆయన వ్రాసిన రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానావకాశాలు, గౌరవం కల్పించేందుకు కృషి చేయాలి,” అని అన్నారు. 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో బిజెపి కార్యాలయంలో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కేంద్రప్రభుత్వ పాలన సాగుతోంది. దేశంలో అంబేడ్కర్‌కు సంబందించిన ప్రాంతాలను పంచతీర్ధాలుగా అభివృద్ధి చేస్తున్నాము,” అని చెప్పారు.