
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో ప్రతీరోజు వేలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిత్యం వందల సంఖ్యలో కరోనా రోగులు మరణిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. ఇదే సమయంలో మందులు, వాక్సిన్ల కొరత ఏర్పడటంతో పరిస్థితులు నానాటికీ దిగజారుగుతున్నాయి. కనుక మహారాష్ట్రలో మళ్ళీ లాక్డౌన్ విధించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ప్రతిపక్షాల సూచన మేరకు రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం లేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తెలిపారు. కానీ కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో గురువారం రాత్రి నుంచి రెండు వారాలపాటు కర్ఫ్యూ విధించబోతునట్లు తెలిపారు. కర్ఫ్యూ సమయంలో ఇంచుమించు లాక్డౌన్ తరహాలోనే ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. కరోనా చైన్ త్రెంచేందుకు ఇది తప్పనిసరి అని చెప్పారు. రేపటి నుంచి మహారాష్ట్రలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను, సినిమా హాల్స్, హోటల్స్, పబ్బులు, క్లబ్బులు, పార్కులు, మద్యం దుకాణాలు, షాపింగ్ మాల్స్, ప్రార్ధనా మందిరాలు అన్నిటినీ రెండు వారాల పాటు మూసివేయనునట్లు మహా సిఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. మళ్ళీ మే 1వ తేదీ నుంచి అన్ని తెరుచుకొంటాయని తెలిపారు. పెట్రోల్ బంకులు, బ్యాంకులు, మందుల దుకాణాలు, ఆసుపత్రులు తదితర అత్యవసర సేవలను మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయిస్తున్నట్లు సిఎం ఉద్ధవ్ థాక్రే తెలిపారు.