
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “బండి సంజయ్ రాన్రాను దిగజారిపోయి చాలా చవుకబారుగా మాట్లాడుతున్నారు. రాష్ట్ర రాజకీయాలలో ఎంతో హుందాగా వ్యవహరిస్తారని పేరున్న మా పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డిని ఉద్దేశ్యించి ఆయన అన్న మాటలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీకే అంకితమైపోయిన కె.జానారెడ్డి పార్టీ మారుతారంటూ బండి సంజయ్ చెప్పడం సిగ్గుచేటు.
ప్రతీ ఎన్నికలలో సరిగ్గా పోలింగ్‌కు ముందు మా పార్టీ అభ్యర్ధి పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం బిజెపి నేతలకి పరిపాటిగా మారిపోయింది. దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి ఇదే విదంగా చేసి మా అభ్యర్ధిని దొంగదెబ్బ తీసారు. మళ్ళీ ఇప్పుడు నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో కూడా అదే ట్రిక్ ప్లే చేయాలని చూస్తున్నారు. కానీ జానారెడ్డి గురించి తెలిసినవారెవరూ ఆయన గురించి బిజెపి చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని నమ్మరు. టిఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పడతాయోననే భయంతోనే బిజెపి నేతలు ఇటువంటి చవుకబారు ప్రయత్నాలు చేస్తున్నారని మాకు తెలుసు. కానీ టిఆర్ఎస్, బిజెపిలు ఎన్ని కుట్రలు చేసినా ఈ ఉపఎన్నికలలో కె.జానారెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. ఆయన గెలుపే ఆ రెండు పార్టీలకు సమాధానం చెపుతుంది,” అని అన్నారు.