
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం వరంగల్ నగరంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల ఆత్మహత్య చేసుకొన్న కాకతీయ విద్యార్ధి సునీల్ నాయక్ మృతిపై స్పందిస్తూ “తమ్ముడు సునీల్ నాయక్ చనిపోయే ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోను చూశాను. ఐఏఎస్ కావాలనుకొన్న అతను ఆ నోటిఫికేషన్ రాకపోవడంతో నిరాశ చెంది ఆత్మహత్యాయత్నం చేసిన్నట్లు దానిలో చెప్పాడు. నిజానికి ఐఏఎస్ నోటిఫికేషన్ యూపీఎస్సీ ఇస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వమో... టిఎస్పీఎస్సీయో కాదు. కానీ ఎవరో అతనిని తప్పుదారి పట్టించి రెచ్చగొట్టడంతో ఆత్మహత్య చేసుకొన్నాడు. అతను చనిపోవడం నాకు కూడా చాలా బాధ కలిగించింది. రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు జరుగుతున్నందునే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయలేకపోతున్నాము తప్ప వేరే కారణం లేదు. ఎన్నికలు పూర్తయిపోగానే నోటిఫికేషన్లు విడుదల చేస్తాము,” అని అన్నారు.
అయితే సునీల్ నాయక్ పోలీస్ కానిస్టేబిల్ ఉద్యోగం కోసం 2016 నుంచి ప్రయత్నిస్తున్నట్లు ఆ సెల్ఫీ వీడియోలో చెప్పాడు. 2016లో కానిస్టేబిల్ పోస్టుకి అర్హత సాధించినప్పటికీ హైట్ తక్కువగా ఉన్నందున తనను పక్కన పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పటి నుంచి మరింత పట్టుదలగా పుస్తకాలు తెచ్చుకొని చదువుతూ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నానని స్పష్టంగా చెప్పాడు. కానీ ఎంతకాలమైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయడంలేదనే ఆవేదనతో విషం త్రాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పాడు. నిరుద్యోగులందరూ ఈ విషయమై ప్రభుత్వంతో పోరాడాలని ఒకవేళ బ్రతికివస్తే తాను కూడా ఆ పోరాటంలో పాల్గొంటానని సునీల్ నాయక్ చెప్పాడు.