
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం గురించి బహుశః చాలామంది మరిచిపోయుండవచ్చు. ఆ కేసుపై దర్యాప్తు జరుపుతున్న ఈడీ నేడు హైదరాబాద్లో 10 ప్రాంతాలలో ఒకేసారి సోదాలు నిర్వహిస్తోంది. వాటిలో మాజీ కార్మికశాఖ మంత్రి స్వర్గీయ నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, నాయిని కార్యదర్శిగా పనిచేసిన ముకుందరెడ్డిల ఇళ్ళు కూడా ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణితో సహా మరికొందరు నిందితుల ఇళ్ళు, కార్యాలయాలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈఎస్ఐ కుంభకోణంలో నిందితులందరూ కలిసి నకిలీ బిల్లులతో రూ.6.5 కోట్లు ప్రభుత్వ ధనం కాజేసినట్లు ఏసీబీ గుర్తించింది. వారిలో కొందరు కొంత సొమ్మును విదేశాలకు తరలించినట్లు గుర్తించడంతో ఈ కేసుపై దర్యాప్తు చేయవలసిందిగా కోరుతూ ఏసీబీ ఈడీకి ఒక లేఖ వ్రాసింది. దాని ఆధారంగా ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతోంది. దానిలో భాగంగానే నేడు నిందితుల ఇళ్ళలో సోదాలు చేస్తోంది.