.jpg)
మావోయిస్టులకు చిక్కిన కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ క్షేమంగా ఇంటికి చేరుకొన్నాడు. మావోయిస్టులు అతనికి ఎటువంటి హానీ చేయకుండా ఎటువంటి షరతులు విధించకుండా విడిచిపెట్టారు.
ఈనెల 3వ తేదీన ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్-సుకుమా జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల దాడిలో 22 మంది జవాన్లు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ వారికి చిక్కాడు. అతనికి ఎటువంటి హానీ తలపెట్టకుండా వెంటనే విడుదల చేయాలని అతని భార్యా,పిల్లలు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ జి. హరగోపాల్ విజ్ఞప్తి చేశారు.
మావోయిస్టులు స్పందిస్తూ, కమాండో రాకేశ్వర్ సింగ్ తమ వద్ద క్షేమంగా ఉన్నాడని చెపుతూ ఓ ఫోటో విడుదల చేశారు. దాంతో బాటు మావోయిస్ట్ కమిటీ పేర ఓ లేఖ కూడా విడుదల చేశారు. దానిలో ‘పోలీసులను తమ శత్రువులుగా భావించడం లేదని, తమతో చర్చల కోసం రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే వారికి అతనిని అప్పగిస్తామని పేర్కొన్నారు. కానీ వారి లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించనప్పటికీ మావోయిస్టులు కమాండో రాకేశ్వర్ సింగ్‌ను గురువారం బేషరతుగా విడుదల చేయడం విశేషం. అతను క్షేమంగా ఇంటికి చేరుకొన్నాడని ఛత్తీస్‌ఘడ్ ఐజీ దృవీకరించారు.
ఇరవైరెండు మంది జవాన్లను బలిగొన్నందుకు మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకొంటామని కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈసారి మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టేసేందుకు అవసరమైన చర్యలు తీసుకొంటామని ప్రకటించారు. బహుశః ఆ భయంతోనే మావోయిస్టులు కమాండో రాకేశ్వర్ సింగ్‌ను విడుదల చేశారేమో?