సిరిసిల్లలో నిరుద్యోగి ఆత్మహత్య

ఇటీవల సునీల్ నాయక్ (25) అనే నిరుద్యోగి హన్మకొండలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకోగా నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల గ్రామానికి చెందిన మహేందర్ యాదవ్ (30) అనే మరో నిరుద్యోగి బావిలో దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు. 

తెలంగాణ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న మహేందర్ యాదవ్ తెలంగాణ యాదవ్ విద్యార్ధి ఫెడరేషన్‌ను స్థాపించాడు. ఇంజనీరింగ్ చదువుతో ఉద్యోగాలు లభించడం లేదని భావించి బీఎస్సీ కూడా చేసి గత ఆరేళ్ళుగా హైదరాబాద్‌లో ఉంటూ ప్రభుత్వోద్యోగాల కోసం సిద్దం అవుతున్నాడు. ఇటీవల బీరప్ప ఉత్సవాల కోసం గ్రామానికి వచ్చినప్పుడు తల్లితండ్రులు అతని పెళ్ళి ప్రస్తావన తెచ్చినప్పుడు, “నేనే మీకు భారంగా ఉంటే మళ్ళీ మరొకరు ఎందుకు? ఏదైనా మంచి ఉద్యోగం దొరికితే అప్పుడు పెళ్ళి చేసుకొంటాను,” అని చెప్పినట్లు తెలుస్తోంది.

ఉద్యోగం దొరకలేదనే నిరాశనిస్పృహలతో ఉన్న మహేందర్ యాదవ్, తల్లితండ్రుల ఆకాంక్షలు నెరవేర్చలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అప్పుడు తల్లితండ్రులు అతనిని ఓదార్చి ధైర్యం చెప్పారు కానీ తీవ్ర మనస్తాపానికి గురైన మహేందర్ యాదవ్ సోమవారం ఉదయం బావిలో దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు. పెళ్ళి చేస్తే కొడుకు జీవితంలో మార్పు వస్తుందని ఆశతో ఆ ప్రస్తావన చేస్తే చెట్టంత కొడుకును పోగొట్టుకొన్నామని తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.