నేడు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో మొదటి రెండు దశల పోలింగ్ పూర్తికాగా నేడు అక్కడ మూడో దశ పోలింగ్ జరుగనుంది. అన్ని చోట్ల పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుంది.
తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు అధికార అన్నాడీఎంకె పార్టీతో కలిసి బిజెపి, ప్రధాన ప్రతిపక్షపార్టీ డీఎంకెతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుండగా కమల్ హాసన్ అధ్యక్షతన ఏర్పాటైన మక్కల్ నీది మయ్యం-ఐజెకే మరికొన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి. తమిళనాడు శాసనసభకు నేడు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది కనుక నేడు అన్ని పార్టీలకు, అభ్యర్ధులకు చాలా కీలకమైన రోజు. రాష్ట్రంలో 88,936 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 1.58 లక్షల మంది భద్రతా సిబ్బందితో భద్రత కల్పిస్తున్నారు.
కేరళ రాష్ట్రంలో 140 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే దశలో పోలింగ్ జరుగనుంది. కేరళలో దశాబ్ధాలుగా కాంగ్రెస్ కూటమి (యుడీఎఫ్) లేదా వామపక్ష కూటమి (ఎల్డీఎఫ్) కూటములు మాత్రమే అధికారంలో ఉంటున్నాయి. ఓసారి ఒకటి మరోసారి మరొకటి గెలుస్తున్నాయి. ఆ లెక్కన ప్రస్తుతం ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది కనుక ఈ ఎన్నికలలో యుడీఎఫ్ గెలిచే అవకాశం ఉందని భావించవచ్చు. అందుకే ఈసారి రాహుల్ గాంధీ కేరళపై ప్రత్యేక దృష్టిపెట్టి ఎన్నికల ప్రచారం చేశారు. ఈసారి కేరళలో అడుగుపెట్టాలని బిజెపి కూడా పట్టుదలగా ఉంది. అందుకోసం అది మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్‌ను పార్టీలో చేర్చుకొని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించింది. దాని ఎత్తు ఫలిస్తుందా లేదో చూడాలి.
పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం కారణంగా ప్రభుత్వం కూలిపోవడంతో నేడు 30 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరుగనుంది.
అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలలో ఇప్పటికే మొదటి రెండు దశలలో 86 స్థానాలకు ఎన్నికలు పూర్తికాగా నేడు చివరిదశ పోలింగ్‌లో మిగిలిన 40 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. దీని కోసం మొత్తం 11,401 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మొత్తం 8 దశలలో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. నేడు జరుగబోయే మూడో దశలో 31 స్థానాలకు పోలింగ్ జరుగనుంది.
చిత్రం: ఇండియా టుడే సౌజన్యంతో...