
ఛత్తీస్‌ఘడ్‌లో దారుణం జరిగింది. మావోయిస్టుల దాడిలో 22 మంది జవాన్లులు మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం...బీజాపూర్-సుకుమా జిల్లాల సరిహద్దులలో మావోయిస్ట్ నేత హిడ్మా అధ్యర్యంలో మావోయిస్టులకు యుద్ధశిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం సాయంత్రం బేస్ క్యాంప్‌ల నుంచి కోబ్రా, ఎస్టీఎఫ్, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ దళాలకు చెందిన సుమారు 2,000 మంది జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ కోసం బయలుదేరారు. వారిలో కొందరు శనివారం బేస్ క్యాంప్‌కు తిరిగివస్తుండగా మావోయిస్టులు హటాత్తుగా వారిని చుట్టుముట్టి లైట్ మెషీన్ గన్స్, గ్రెనేడ్స్తో దాడి చేశారు. జవాన్లు దిగువ ప్రాంతంలో ఉండగా మావోయిస్టులు వ్యూహాత్మకంగా గుట్టలపై పొంచి ఉండి దాడి చేయడంతో చాలా ప్రాణనష్టం జరిగింది. జవాన్లు వెళ్ళే దారిలో టేకులగూడ వద్ద ఐఈడీ బాంబులు కూడా అమర్చడంతో అది పేలి ఓ జవాన్ మరణించాడు.
చనిపోయినవారిలో ఏడుగురు కోబ్రా బెటాలియన్‌కు చెందినవారు కాగా, ఎస్టీఎఫ్-6మంది, డీఆర్జీ-8 మంది, సీఆర్పీఎఫ్ కు చెందిన ఒక జవాన్ ఉన్నారు. వారిలో విజయనగరం, గుంటూరు జిల్లాలకు చెందిన రౌతు జగదీష్ (27), మురళీకృష్ణ (32) ఉన్నారు. గాయపడిన, చనిపోయిన జవాన్లను హెలికాప్టర్లో రాయ్‌పూర్, బీజాపూర్ ఆసుపత్రులకు తరలించారు. మావోయిస్టుల దాడిలో 22 మంది జవాన్లు చనిపోవడంపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా చాలా తీవ్రంగా స్పందించారు. జవాన్లను బలిగొన్న మావోయిస్టులపై అంతకంతా ప్రతీకారం తీర్చుకొంటామని చెప్పారు.