
ప్రభుత్వోద్యోగం కోసం ఎదురుచూసి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడదనే నిరాశతో సునీల్ నాయక్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకొనడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. విద్యార్దులు, నిరుద్యోగ యువత, ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నారు. సునీల్ ఆత్మహత్య చేసుకొనే ముందు సెల్ఫీ వీడియోలో చెప్పిన మాటలను మరణ వాంగ్మూలంగా పరిగణించి సిఎం కేసీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామని సిఎం కేసీఆర్ ప్రకటించారని కానీ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని, అందరూ కలిసి పొరాడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఖాళీగా ఉన్న 1.92 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసుకొందామని బండి సంజయ్ అన్నారు.
తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం సకాలంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు ప్రకటించి ఉండి ఉంటే సునీల్ బ్రతికి ఉండేవాడని కానీ ఏదో వంకతో ఆలస్యం చేయడంతో సునీల్ ఆత్మహత్య చేసుకొన్నాడని, కనుక సునీల్‌ది ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్యేనని అన్నారు. రాష్ట్రంలో 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని కానీ ప్రభుత్వం వాటిని భర్తీ చేయడానికి వెనకాడుతుండటం వలన సునీల్ వంటి నిరుద్యోగ యువత పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించాలని తాము గత 5 ఏళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.