1.jpg)
సునీల్ నాయక్ అనే 25 ఏళ్ళ యువకుడు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తానన్న ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి ఇక రావనే నిరాశతో హన్మకొండలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకోవడంపై విద్యార్దులు, నిరుద్యోగులు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై భగ్గుమంటున్నాయి.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిన్న గాంధీభవన్‌లో సునీల్ నాయక్‌కు నివాళులు అర్పించిన తరువాత సిఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఉద్యోగాల కల్పన విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగానే సునీల్ నాయక్ చనిపోయాడు. కనుక అతని మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఉద్యోగాల కోసం యువత ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏవిదంగా కోట్లాడి సాధించుకొన్నామో అదేవిదంగా ఉద్యోగాల కోసం కూడా అందరం కలిసి కోట్లాడి సాధించుకొందాము. ఈ కొలువుల కొట్లాటలో సునీల్ నాయక్ మరణం చివరిది కావాలి. సునీల్ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి,” అని అన్నారు.
కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్ రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు కూడా ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పు పట్టారు.
గురువారం సాయంత్రం యువజన కాంగ్రెస్ అధ్వర్యంలో సునీల్ నాయక్‌కు శ్రద్ధాంజలి ఘటించేందుకు హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.