రాష్ట్రంలో మరిన్ని పట్టణాలకు ఐ‌టి కంపెనీలు: కేటీఆర్‌

తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ నిన్న ఖమ్మంలో కొత్తగా నిర్మించిన ఆర్టీసీ కాంప్లెక్స్ ను ప్రారంభించిన తరువాత పట్టణంలో ఐ‌టి హబ్‌ రెండో దశ పనులకు ప్రారంభోత్సవం చేశారు. రూ.36 కోట్లతో నిర్మించబడుతున్న ఈ ఐటీ-హబ్‌ పనులు పూర్తయితే మరిన్ని ఐటి కంపెనీలు వస్తాయి. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో ద్వితీయశ్రేణి పట్టణాలను కూడా అభివృద్ధి చేసేందుకు మా ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. అందుకు ఖమ్మం పట్టణంలో జరుగుతున్న ఈ అభివృద్ధి పనులే నిదర్శనం. ఏడాదిలోగా ఈ ఐటీ-హబ్‌ పనులు కూడా పూర్తిచేసి మళ్ళీ వచ్చే ఏడాది ఇదే సమయానికి దీనిని ప్రారంభిస్తాము. రాష్ట్రంలో ద్వితీయశ్రేణి పట్టణాలలో కూడా ఐ‌టి కంపెనీలను విస్తరించేలా చేయాలనే ఆలోచనతో ఇప్పటికే వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లో ఐటీ-హబ్‌లు ఏర్పాటు చేశాము. త్వరలో నల్గొండ, రామగుండం, సిద్ధిపేటలో కూడా ఐటీ-హబ్‌లు ఏర్పాటు చేయబోతున్నాము. తద్వారా స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయి. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రూ.56,000 కోట్ల విలువగల ఐ‌టి ఎగుమతులు జరుగుతుందేవి. కానీ ఈ ఆరున్నరేళ్ళలో అవి రూ.1.40 లక్షల కోట్లకు చేరుకొన్నాయి. సిఎం కేసీఆర్‌ దూరదృష్టి, సమర్ధమైన పరిపాలన, అవినీతిరహితమైన, సరళమైన ప్రభుత్వ విధానాల వలననే రాష్ట్రానికి అనేక ఐ‌టి కంపెనీలు, వాణిజ్య సంస్థలు, పెట్టుబడులు వస్తున్నాయి. కేంద్రం సహకారంలేకపోయినా తెలంగాణ రాష్ట్రం సిఎం కేసీఆర్‌ నాయకత్వంలో శరవేగంగా అన్నిరంగాలలో అభివృద్ధి సాధిస్తోంది. మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపనులే మా పనితీరును వివరిస్తున్నాయి. ఈ అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే ప్రజలు కూడా మమ్మల్ని ఆశ్వీర్వదించి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు.