తూచ్...పొరపాటున ఉత్తర్వులిచ్చాం!

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా ఉత్తర్వులు జారీ చేస్తే వాటిపై సంబందితశాఖల మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు లోతుగా అధ్యయనం చేస్తారు. కనుక ప్రభుత్వాలు పొరపాటున ఉత్తర్వులు జారీ చేశామని చెప్పలేవు. కానీ కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పొరపాటున ఉత్తర్వులు జారీ చేశామని చెప్పుకొన్నారు. 

సామాన్య ప్రజలు భవిష్య అవసరాల కోసం తమ కష్టార్జితాన్ని చిన్న పొదుపు పధకాలలో దాచుకొంటారు. ప్రభుత్వాల దృష్టి ఎప్పుడూ సామాన్యులపైనే ఉంటుంది కనుక ఆ పొదుపు మొత్తాలపై ఇచ్చే వడ్డీ రేట్లను 40-110 బేసిస్ పాయింట్ల మద్య కోత విధిస్తున్నట్లు ఆర్ధికశాఖ బుదవారం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ పొరపాటున ఉత్తర్వులు జారీ చేశామని కనుక వాటిని ఉపసంహరించుకొంటున్నట్లు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ్ళ చెప్పారు. 


దీనిపై ప్రతిపక్షాలు తమదైన శైలిలో స్పందించాయి. ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా వాద్రా స్పందిస్తూ, “నిజంగానే పొరపాటున ఉత్తర్వులిచ్చారా... లేక ఎన్నికల జిమ్మికా?” అని ప్రశ్నించారు. 

ప్రస్తుతం పుదుచ్చేరి, నాలుగు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నందున, చిన్న పొదుపు పధకాల వడ్డీపై కోత విడిస్తే ప్రజాగ్రహానికి గురవుతామనే భయంతోనే, కేంద్రప్రభుత్వం ఉత్తర్వులను ఉపసంహరించుకొందని, మద్యతరగతి ప్రజలను ‘ఏప్రిల్ ఫూల్’ చేసి ఆడుకొంటోందని బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా లేక సర్కస్ కంపెనీ నడిపిస్తున్నారా? అని కాంగ్రెస్‌ నేత రణదీప్ సింగ్‌ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు.