గో మహాగర్జనకు హైకోర్టు అనుమతి

యుగ తులసి ఫౌండేషన్ అధ్వర్యంలో ఏప్రిల్ 1వ తేదీన హైదరాబాద్‌ ఎన్టీఆర్ స్టేడియంలో గో మహాగర్జన సభ నిర్వహించుకొనేందుకు హైకోర్టు అనుమతించింది. కరోనా కారణంగా ఈ సభకు పోలీస్ శాఖ అనుమతి నిరాకరించడంతో యుగ తులసి ఫౌండేషన్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు రాజకీయ బహిరంగసభలు, సమావేశాలు, సినిమా కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు అనుమతిస్తున్నప్పుడు, గో మహాగర్జన సభకు ఎందుకు అభ్యంతరం చెపుతున్నారని పోలీస్ శాఖను ప్రశ్నించింది. 400 మందికి మించకుండా కోవిడ్ నిబందనలు పాటిస్తూ గో మహాగర్జన సభను జరుపుకొనేందుకు హైకోర్టు అనుమతించింది.  

దేశవ్యాప్తంగా ఉన్న గోవులను కాపాడాలని, గోవధ నిషేదించాలని, గోవులను వదిస్తున్న కబేళాలను మూసివేయాలనే డిమాండ్స్‌తో యుగ తులసి ఫౌండేషన్ ఈ గో మహాగర్జన సభను నిర్వహించాలనుకొంటోంది. దీనికి త్రిదండి చిన జియ్యర్ స్వామితో సహా అనేకమంది స్వామీజీలు, పీఠాధిపతులు వస్తారని యుగఫౌండేషన్ నిర్వాహకులు చెపుతున్నారు.