నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు నామినేషన్ గడువు నేటితో ముగియనున్నందున టిఆర్ఎస్, బిజెపిలు తమ అభ్యర్ధులను ప్రకటించాయి. టిఆర్ఎస్ అభ్యర్ధిగా స్వర్గీయ నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ కుమార్ ను ఎంపిక చేయగా బిజెపి అభ్యర్ధిగా డాక్టర్ రవి కుమార్‌ను బరిలో దింపుతోంది. కాంగ్రెస్ పార్టీ నెలరోజుల క్రితమే సీనియర్ నేత కె.జానారెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించింది. దీంతో మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులెవరనేది స్పష్టత వచ్చింది. నామినేషన్లకు ఈరోజే చివరిరోజు కనుక మూడు పార్టీల అభ్యర్ధులు నేడు నామినేషన్లు వేయనున్నారు. బిజెపి తరపున పోటీ చేసేందుకు ఈసారి తనకే తప్పకుండా అవకాశం లభిస్తుందనే ఆశతో ఆ పార్టీ సాగర్ ఇన్-ఛార్జ్ కంకణాల నివేదిత రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. కానీ ఆమెకు బదులు డాక్టర్ రవి కుమార్ పేరును ఖరారు చేసినందున ఇప్పుడు ఆమె నామినేషన్ వెనక్కు తీసుకోంటారో లేదో చూడాలి.
నామినేషన్లకు గడువు: మార్చి 30
నామినేషన్ల పరిశీలన: మార్చి 31
నామినేషన్ల ఉపసంహరణ: ఏప్రిల్ 3
సాగర్ ఉపఎన్నిక: ఏప్రిల్ 17
కౌంటింగ్, ఫలితాలు : మే 2.