యాదాద్రి ఆలయంలో 68 మందికి కరోనా

యాదాద్రి పవిత్ర పుణ్యక్షేత్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. మూడు రోజుల క్రితం ఆలయంలో 36 మంది కరోనా బారిన పడగా, శుక్రవారం మరో ఆరుగురికి, శనివారం మరో 30 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా బారిన పడిన ఆలయ సిబ్బంది, అర్చకుల సంఖ్య 68కి చేరింది. వీరుకాక ఆలయ సిబ్బంది కుటుంబసభ్యులలో మరో నలుగురికి కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. ఇద్దరు విలేఖరులకు కూడా కరోనా సోకింది. యాదాద్రిలో నానాటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆదివారం యాదగిరిగుట్టలోని తులసీ కాటేజీలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి 312 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 38 మందికి పాజిటివ్ అని తేలింది. కనుక కరోనా కట్టడికి మళ్ళీ ఆలయం మూసివేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.