వృద్ధాప్య పింఛనుపై సిఎం కేసీఆర్‌ తాజా ప్రకటన

టిఆర్ఎస్‌ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలలో వృద్ధాప్య పింఛను వయోపరిమితిని 57 ఏళ్ళకు తగ్గించడం కూడా ఒకటి. అది అమలు చేస్తే రాష్ట్రంలో వేలాదిమంది  వృద్ధులకు చేయూత అవుతుంది కనుక దాని కోసం వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ హామీపై సిఎం కేసీఆర్‌ స్వయంగా నిన్న శాసనసభలో ప్రకటన చేశారు. అతిత్వరలోనే దీనిపై ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. దయనీయ జీవితాలు గడుపుతున్న ఆర్టీసీ కార్మికులకు కూడా త్వరలోనే జీతాలు పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినందున విద్యార్దుల హాస్టల్ మెస్ చార్జీలను కూడా పెంచి ఇస్తామని చెప్పారు. కానీ నిరుద్యోగ భృతి హామీ అమలులుపై నిర్ధిష్టంగా ఎటువంటి హామీ ఇవ్వకపోవడం నిరుద్యోగులకు తీవ్ర నిరాశ కలిగించే విషయమే. దీనిపై లోతుగా అధ్యయనం చేసిన తరువాత తగిన నిర్ణయం తీసుకొంటామని సిఎం కేసీఆర్‌ చెప్పారు.