నేడు అసోం, బెంగాల్లో మొదటిదశ పోలింగ్

అసోం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల శాసనసభలకు నేడు తొలిదశ ఎన్నికలు జరుగనున్నాయి. అసోంలో 47, బెంగాల్లో 30 స్థానాలకు నేడు పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 

అసోంలో అధికారం చేజిక్కించుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ 8 పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి అధికార బిజెపి-ఏజీపీ కూటమితో పోటీ పడుతోంది. 

ఈసారి ఎలాగైనా సరే పశ్చిమ బెంగాల్లో అధికారం చేజిక్కించుకొనేందుకు బిజెపి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో గట్టిగా పోటీ పడుతోంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి పోటీ చేస్తుండగా, తొలిసారిగా మజ్లీస్ పార్టీ కూడా బెంగాల్లో పోటీ చేస్తోంది.  

తాజా సర్వేల ప్రకారం అసోంలో మళ్ళీ బిజెపి-ఏజీపీ కూటమి, పశ్చిమ బెంగాల్లో మళ్ళీ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానున్నట్లు సమాచారం.  

రెండు రాష్ట్రాలలో నేడు ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలలో చాలావరకు సమస్యాత్మకమైనవి కావడంతో భారీగా పారామిలటరీ దళాలను మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎన్నికల సంఘాలు అన్ని జాగ్రత్తలు తీసుకొన్నాయి.