
రెండో దశ కరోనాలో కూడా మళ్ళీ మహారాష్ట్రలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ఆ రాష్ట్రంలో పలు జిల్లాలలో ఇప్పటికే పాక్షికంగా, శని,ఆదివారాలలో సంపూర్ణంగా లాక్‌డౌన్ విధిస్తున్నారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో కరోనా తీవ్రత చాలా పెరిగిపోవడంతో నేటి నుంచి 10 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలో అత్యవసర సేవలు తప్ప మిగిలినవన్నీ మూసివేయాయాలని ఆదేశించారు. అలాగే తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలతో సరిహద్దులు పంచుకొంటున్న నాందేడ్ జిల్లాలో కూడా బుదవారం అర్ధరాత్రి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ రెండు జిల్లాలో ఏప్రిల్ 4వ తేదీ వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని, ఆ తరువాత పరిస్థితులను సమీక్షించి లాక్‌డౌన్ ఎత్తివేయాలా... పొడిగించాలా...అని నిర్ణయం తీసుకొంటామని ఆయా జిల్లా కలెక్టర్లు చెప్పారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించకుండా చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందునే ఈ దుస్థితి ఏర్పడిందని కనుక ఇకనైనా పూర్తి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని అధికారులు చెపుతున్నారు. లేకుంటే మళ్ళీ మళ్ళీ లాక్‌డౌన్ విధింపు అనివార్యం అవుతుందని హెచ్చరిస్తున్నారు.
అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులను నిలిపివేయనప్పటికీ సంపూర్ణ లాక్‌డౌన్ విధించిన కారణంగా మహారాష్ట్రలో నాందేడ్‌తో సహా పలు ప్రాంతాలకు అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులు నిలిచిపోయాయి.