వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన స్వతంత్ర అభ్యర్ధి తీన్మార్ మల్లన్నను ఇప్పుడు అన్ని పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. అయితే తాను ఏ పార్టీలోను చేరదలచుకోలేదని, బిజెపిలో చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదని స్పష్టం చేశారు.
ఆయన నిన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నాకు ఈ ఎన్నికలలో ఏ పార్టీ నుంచి.. రాజకీయ నాయకుల నుంచి డబ్బు, మద్దతు తీసుకోలేదు. నా ఎన్నికల ప్రచారానికి కావలసిన డబ్బును ప్రజలే ఇచ్చారు. వారే నా వాదనలతో ఏకీభవించి ఇన్ని ఓట్లు నన్ను ప్రోత్సహించారు. కనుక బండి సంజయ్ లేదా రేవంత్ రెడ్డితో నన్ను ముడిపెట్టడం సరికాదు. వాళ్ళు నాకు ఓట్లు వేయించారనే వాదనలు సరికాదు. అదే నిజమానుకొంటే ఆ ఓట్లు వాళ్ళ పార్టీల అభ్యర్ధులకే వేయించుకొని ఉంటే వారే గెలిచి ఉండేవారు కదా? కనుక వారికీ నాకు ఎటువంటి సంబందమూ లేదు. అలాగే 45కేజీల సిఎం కేసీఆర్ శరీరంతో నాకు ఎటువంటి శతృత్వం లేదు కానీ ఆయన మెదడు తీసుకొనే నిర్ణయాలనే నేను వ్యతిరేకిస్తున్నాను. త్వరలో రాష్ట్రంలో అన్ని జిల్లాల గుండా 6,000 కిమీ పాదయాత్ర చేయబోతున్నాను. వచ్చే శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి గెలిచి నావంటి ఇంకా అనేకమంది సామాన్యులతో కలిసి శాసనసభలో అడుగుపెట్టడం ఖాయం. అందుకోసం కొత్త పార్టీ పెట్టాలా వద్దా అనేది తరువాత నిర్ణయించుకొంటాము,” అని అన్నారు.