ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్స్ ఏమయ్యాయి? షర్మిళ

హటాత్తుగా తెలంగాణ రాజకీయాలలోకి ప్రవేశించిన వైఎస్ షర్మిళ, ముందుగా జిల్లాలవారీగా వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. తరువాత రాష్ట్రంలో వివిద వర్గాల ప్రజలతో భేటీ అవుతున్నారు. లోటస్‌పాండ్‌ నివాసంలో నిన్న ముస్లిం ప్రజలతో సమావేశమైనప్పుడు షర్మిళ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “ముస్లింలు లేని హైదరాబాద్‌ నగరాన్ని...తెలంగాణ రాష్ట్రాన్ని ఊహించుకోవడమే కష్టం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరున్నరేళ్ళు అవుతున్నా ముస్లింల జీవితాలలో ఎటువంటి మార్పు రాలేదు. టిఆర్ఎస్‌ పార్టీ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకొంటుంటే, బిజెపి హేట్ బ్యాంకుగా వాడుకొంటోంది. అందరూ ముస్లింలను ఉపయోగించుకొంటునవారే గానీ వారి సంక్షేమం గురించి ఆలోచించేవారే లేరు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో వారు వివిద ఉద్యోగాలను పొందగలిగారు. కానీ ముస్లింలకు 4 శాతం సరిపోదని 12శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించి చేతులు దులుపుకొంది. మళ్ళీ ఆ ప్రస్తావనే చేయలేదు. కేవలం వారి ఓట్ల కోసమే అప్పుడు12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశపెట్టి మోసం చేసింది. రాష్ట్రంలో ముస్లింల జీవితాలు బాగుపడాలంటే మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి,” అని షర్మిళ అన్నారు.