
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మళ్ళీ పోటీ చేస్తున్న టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇవాళ్ళ నల్గొండలో పట్టభద్రుల సమావేశంలో మాట్లాడుతూ, “ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎస్సీ, ఎస్సీ, బీసీ నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త పధకం ప్రకటించబోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు ఇతర రాష్ట్రాల కంటే కాస్త ఎక్కువే వేతన సవరణ ఇస్తామని సిఎం కేసీఆర్ నిన్న హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయి. ఒక్క నల్గొండ జిల్లాలోనే మూడు వైద్య కళాశాలలు ఏర్పాటు చేశాము. జిల్లాలో ఇంకా అనేక అభివృద్ధి పనులు చేశాము. ఇవన్నీ మీ అందరికీ తెలుసు. కనుక ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరుతున్నాను. జిల్లా అభివృద్ధి కోసం అందరూ నాకే మళ్ళీ ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎవరూ కొత్తగా ఎటువంటి పధకాలు ప్రకటించకూడదు. అలా చేస్తే అది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లే అవుతుంది. కనుక పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన తాజా ప్రకటనపై ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.