
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ సికింద్రాబాద్లో నిన్న పట్టభద్రులతో సమావేశమైనప్పుడు వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చేసిన సాయం ఏమీలేదు కానీ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో ఏటా లక్షల కోట్లు పట్టుకుపోతోంది. ఆ సొమ్ములో తెలంగాణకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటాను కూడా ఇవ్వకుండా బిజెపి పాలిత రాష్ట్రాలలో ఆ సొమ్మును ఖర్చు చేస్తోంది. కేంద్రప్రభుత్వం సహకరించకపోయినా సిఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాలలో స్వయంకృషితో అభివృద్ధి సాధించగలిగాము.
గత ఆరున్నరేళ్ళలో రాష్ట్రంలో 672 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాము. వాటిలో ఒక్కో విద్యార్ధిపై రూ.1.20 లక్షలు చొప్పున ఖర్చు చేస్తున్నాము. రూ.350 కోట్లతో కొత్తగా 240 గురుకుల పాఠశాల భవనాలు నిర్మించాము. 15 లక్షల మంది విద్యార్దులకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్పులు ఇస్తున్నాము. గత ఆరున్నరేళ్ళలో రూ.12,800 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాము. కొత్తగా ఐదు వైద్యకళాశాలలు ఏర్పాటు చేశాము. రాష్ట్రంలో 1,33,000 ఉద్యోగాలు భర్తీ చేశాము.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆరున్నరేళ్ళలోనే ఇన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుండగా, కేంద్రప్రభుత్వం మాత్రం మేకిన్ ఇండియా...ఆత్మ నిర్భర్ భారత్ వంటి నినాదాలకే పరిమితమవుతోంది. పైగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేసుకొంటూ ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతోంది. ఎన్నికలు రాగానే బిజెపి నేతలు అక్బర్, బాబర్, హిందూస్థాన్, పాకిస్తాన్, హిందూ, ముస్లింలంటూ...ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని ప్రయత్నిస్తుంటారు. గత ఆరున్నరేళ్ళలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమేమి చేసిందో చెప్పాను. కనుక టిఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణీదేవికి ఓట్లేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను,” అని అన్నారు.