ఆమరణదీక్ష చేద్దాం వస్తారా? కేటీఆర్‌కు రేవంత్‌ సవాల్

ఉద్యోగాల కల్పన సంగతేమో కానీ ఆ పేరుతో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మద్య చాలా రసవత్తరంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఉద్యోగాల కల్పనలో కేంద్రప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ప్రధాని నరేంద్రమోడీ అన్ని అభివృద్ధి ప్రాజెక్టులను తన సొంతరాష్ట్రమైన గుజరాత్‌కే కేటాయిస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని టిఆర్ఎస్‌ నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కనుక ఆ పార్టీ కూడా ఉద్యోగాల కల్పన విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటుగా విమర్శలు గుప్పిస్తోంది. 

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఇవాళ్ళ కూకట్‌పల్లిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌, బిజెపిలు రెండూ ఒకే నాణేనికి బొమ్మ బోరుసువంటివి. ఉద్యోగాల కల్పన విషయంలో రెండూ ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతున్నాయి. ఇప్పుడు బద్ధశత్రువులలాగా ఈ అంశంపై పరస్పరం విమర్శలు చేసుకొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలననే హైదరాబాద్‌కు రావలసిన ఐ‌టిఐఆర్ ప్రాజెక్టు రద్దు అయిందని బిజెపి వాదిస్తుంటే, కేంద్రప్రభుత్వం ఐ‌టిఐఆర్ ప్రాజెక్టు రద్దు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసిందని టిఆర్ఎస్‌ నేతలు మొసలి కన్నీళ్లు కార్చుతున్నారు. 

ఈ అంశంపై ఐ‌టిమంత్రి కేటీఆర్‌కు చిత్తశుద్ది, దమ్ముంటే వస్తే ఇద్దరం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహారదీక్షకు కూర్చోందాము. మంత్రి కేటీఆర్‌ సిద్దామేనా?ఎన్నికలప్పుడు సిఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రప్రభుత్వాన్ని విమర్శించడం ఆ తరువాత మళ్ళీ వారికి సలాములు చేస్తుండటం పరిపాటిగా మారింది. మంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే నా సవాలును స్వీకరించాలి,” అని రేవంత్‌ రెడ్డి అన్నారు.