
హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకొహ్లీ, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన హైకోర్టు హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం, ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది.
1. వామన్‌రావు సజీవంగా ఉన్నప్పుడు మేజిస్ట్రేట్ ఎదుట ఆయన మరణ వాంగ్మూలం ఎందుకు నమోదు చేయలేదు?
2. ఈ హత్య కేసులో నిందితులుగా పేర్కొన్నవారందరి వాంగ్మూలాలు ఇంతవరకు ఎందుకు తీసుకోలేదు?
3. హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న సిసి ఫుటేజీని సేకరించారా లేదా? సేకరిస్తే దానిని కోర్టుకు ఎందుకు ఇవ్వలేదు?
4. వామన్‌రావు దంపతులపై నడిరోడ్డుపై దాడి జరుగుతున్నప్పుడు ఆ పక్క నుంచే వెళ్ళిన రెండు సిటీబస్సులలో ప్రయాణికులను సాక్షులుగా గుర్తించారా లేదా?ఎంతమందిని గుర్తించారు?
5. హత్యకు సంబందించి సంబందిత వ్యక్తుల వాంగ్మూలాలు తీసుకోకుండా, పక్కా సాక్ష్యాధారాలు సేకరించకుండా కేవలం కేసు నమోదు చేస్తే సరిపోతుందనుకొన్నారా? అంటూ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. హైకోర్టు అడిగిన వివరాలన్నీ సమర్పించేందుకు కొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కోరడంతో ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.