మిగిలిన ఓట్లకోసమే కాంగ్రెస్‌, బిజెపిల పోరాటం: కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చర్చించినప్పుడు కాంగ్రెస్‌, బిజెపిలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

“ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఆరు ఉమ్మడి జిల్లాలో 60 శాతంపైగా ఓట్లు (సుమారు 18 లక్షల ఓట్లు) టిఆర్ఎస్‌ అభిమానులవే. కనుక మన అభ్యర్ధులు తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించడం ఖాయం. టిఆర్ఎస్‌కు పోగా మిగిలిన ఓట్ల కోసమే కాంగ్రెస్‌, బిజెపిలు పోటీ పడుతున్నాయి. కనుక ఆ రెండు పార్టీలు మన దరిదాపుల్లో కూడా లేవు అవి మనకు పోటీ కాదు. అయినప్పటికీ   అతివిశ్వాసంతో వ్యవహరించకుండా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతీ ఒక్కరూ పనిచేసి ఆ మిగిలిన ఓట్లను కూడా మనమే దక్కించుకొనేందుకు పార్టీలో ప్రతీ ఒక్కరూ గట్టిగా కృషి చేయాలి. పరిమిత ఓటర్లతో జరుగుతున్నా ఎన్నికలివి. కనుక పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ ప్రతీ ఓటరును తప్పనిసరిగా కలిసి వారి ఓట్లు మనకే పడేలా చూడాలి. రాష్ట్రంలో ప్రభుత్వ పధకాల ద్వారా లబ్ది పొందుతున్నవారు సుమారు కోటిన్నరమంది ఉన్నారు. టిఆర్ఎస్‌కు 60 లక్షల మంది పార్టీ కార్యకర్తలున్నారు. కనుక ఈ ఎన్నికలలో మనకు చాలా అనుకూలమైన వాతావరణం నెలకొని ఉంది. కనుక పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేసి రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనమే గెలుచుకొనేలా చేయాలి,” అని అన్నారు.