హైదరాబాద్‌లో ఐపిఎల్ మ్యాచ్‌‌లు నిర్వహించండి: కేటీఆర్‌

మంత్రి కేటీఆర్‌ బీసీసీఐ, ఐపిఎల్ మ్యాచ్‌ నిర్వాహకులను ఉద్దేశ్యించి ట్వీట్ చేశారు. దానిలో...కరోనా నియంత్రణలో దేశంలో అన్ని ప్రధాన నగరాల కంటే హైదరాబాద్‌ ముందుందని, హైదరాబాద్‌లో అత్యల్పంగా కరోనా కేసులు నమోదవుతుండటమే అందుకు నిదర్శనమని కనుక హైదరాబాద్‌ను ఐపిఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని ట్వీట్ చేశారు. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించాలని విజ్ఞప్తి చేసారు. అందుకు అవసరమైన సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

దేశంలో ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ముంబై నగరాలలో ఐపిఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని  బీసీసీఐ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. కరోనా కారణంగా ఒకవేళ మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో ఐపిఎల్ మ్యాచ్‌లను అనుమతించకపోతే హైదరాబాద్‌లో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉన్న హైదరాబాద్‌ను కాదని కరోనా ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో ఐపిఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలనుకోవడాన్ని క్రికెట్ అభిమానులు తప్పు పడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ సన్ రైజర్స్ జట్టులో స్థానిక క్రీడాకారులెవరినీ తీసుకోకపోవడంపై అజారుద్దీన్‌, అసదుద్దీన్ ఓవైసీలతో సహా పలువురు ప్రముఖులు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కనీసం హైదరాబాద్‌లో ఐపిఎల్ మ్యాచ్‌లైనా నిర్వహించాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. వారిలో మంత్రి కేటీఆర్‌ కూడా ఒకరు. మరి బీసీసీఐ, ఐపిఎల్ నిర్వాహకులు ఏమి నిర్ణయిస్తారో చూడాలి.