
‘సోషల్ మీడియా అంటే ఎవరినైనా ఎటువంటి అసభ్యపదజాలంతో దూషించవచ్చు...దేని గురించైనా ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయవచ్చు...ఎవరి ఫోటోలు... వీడియోలనైనా అప్లోడ్ చేసేయవచ్చు. మేము ఎదుటవ్యక్తిని లేదా వ్యవస్థలను ఏమైనా అంటాము కానీ మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు...’ అనే భ్రమలో ఉండే చాలామంది రెచ్చిపోతుండటం రోజూ చూస్తూనే ఉన్నాము. అందుకు తాజా ఉదాహరణగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను చెప్పుకోవచ్చు.
అయితే సోషల్ మీడియా సంస్థలు తమ వ్యాపారం...లాభాల కోసం అటువంటివారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుంటాయి. దీని వలన అనేకమంది ప్రముఖులు, సంస్థలు, ముఖ్యంగా మహిళలు నిత్యం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుక సోషల్ మీడియాను కూడా కట్టడి చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కానీ కేంద్రప్రభుత్వం సంయమనం పాటిస్తూ సోషల్ మీడియానే స్వీయ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. అసభ్యకరమైన సందేశాలు లేదా వేరే ఏవైనా సమస్యలపై పిర్యాదులను స్వీకరించేందుకు అన్ని సోషల్ మీడియా సంస్థలు తప్పనిసరిగా 24 గంటలు పనిచేసే ఓ ఫిర్యాదు విభాగాన్ని, దానికి అవసరమైన నోడల్ అధికారిని, సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించింది. ముఖ్యంగా మహిళలకు సంబందించిన పిర్యాదులను 24 గంటలలోగా పరిష్కరించాలని షరతు విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సోషల్ మీడియాకు ఈ మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర మంత్రులు ప్రకాష్ జవాడేకర్, రవిశంకర్ మీడియాకు తెలిపారు.